ఇటీవల కాలంలో smartphoneలలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చిన తర్వాత, గతంలో మాదిరిగా
ఎల్లప్పుడూ మనతోపాటు పవర్ బ్యాంక్ తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది.
ఈమధ్య మార్కెట్లో విడుదల అవుతున్న అన్ని ఫోన్స్ 15, 20, 40W వంటి ఎక్కువ వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ చార్జర్లను కలిగి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో Oppo సంస్థ అతి త్వరలో విడుదల చేయబోతున్న Reno Ace ఫోన్లో కేవలం అరగంటలో 0 నుండి 100% వరకూ చార్జింగ్ పూర్తవుతుంది. దీనికోసం Fast Charge 2.0 టెక్నాలజీ ఆధారంగా పనిచేసే 65W భారీ కెపాసిటీ కలిగిన SuperVOOC అనే ఛార్జర్ ఉపయోగించబడుతుంది.
4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు కేవలం 30 నిమిషాల్లో దీని ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. చైనాలో తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు Xiaomi సంస్థ మరో అడుగు ముందుకేసి కేవలం 17 నిమిషాల్లో 100% చార్జింగ్ పూర్తయ్యే విధంగా Super Charge Turbo అనే టెక్నాలజీని ఆవిష్కరించింది. 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇలా 17 నిమిషాల్లో ఇది ఛార్జింగ్ చేయగలుగుతుంది. భారీగా 100W కెపాసిటీ కలిగిన ఛార్జర్ వాడటం ద్వారా ఇంత తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జింగ్ సాధించగలుగుతారు.
ఈ తాజా పరిణామాలు అన్నీ గమనిస్తే కనుక, ఇక మీదట మనం బ్యాటరీ చార్జింగ్ గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన పనిలేదు. ఒకవేళ ఫోన్ బ్యాటరీ ఖాళీ అయినప్పటికీ ఎక్కడైనా చాలా వేగంగా ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. బరువుగా ఉండే పవర్ బ్యాంకులు మనతోపాటు ఎక్కడికక్కడ తీసుకెళ్లి ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. ఇలా ఒక వైపు బ్యాటరీ ఛార్జింగ్ వాట్స్ పెరుగుతూ ఉంటే, మరో వైపు ఎక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీలను ఫోన్లలో పొందుపరిచే ప్రయత్నాల్లో ఫోన్ తయారీ కంపెనీలు ఉన్నాయి. తద్వారా రాబోయే ఒకటి రెండేళ్లలో కనీసం రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ లభించే ఫోన్లు లభిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ కొత్త ఛార్జర్ 30 నిముషాల్లో 100 శాతం ఎలా బ్యాటరీ ఛార్జ్ చెయ్యగలుగుతుందో డెమో ఈ క్రింది వీడియోలో..