
రెండురోజులు క్రితం Mojo TVలో జరిగిన లైవ్ డిస్కషన్ లో ఒక చిన్న ఆసక్తికరమైన చర్చ జరిగింది. మనం ఫేస్ బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారీ, రెడ్ కలర్లో ఒక సంఖ్య చూపించబడి ఎన్ని నోటిఫికేషన్ల పెండింగ్ ఉన్నాయి అన్నది కనిపిస్తుంది కదా. అది మన మానసిక ఆరోగ్యం మీద చాలా ఒత్తిడి పెంచుతుంది అని నేను పేర్కొనడం జరిగింది.
వాస్తవానికి ఫేస్బుక్ లాంటి అప్లికేషన్లు వినియోగదారుల బ్రెయిన్‌ని అలర్ట్ చెయ్యడం కోసం తద్వారా వారి అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలకమైన మార్పు రాబోతోంది. ఇలా రెడ్ కలర్ లో చూపించబడే నోటిఫికేషన్ డాట్స్ వల్ల ఇబ్బంది ఫీలయ్యేవారు దానిని డిజేబుల్ చేసుకోవడానికి ఏ విధంగా Facebook ఒక ఏర్పాటు చేయబోతోంది.
ఇప్పటికే Android మరియు iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లను వాడే కొద్ది మంది వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ అది మీకు కూడా వచ్చిందో లేదో పరిశీలించాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారు ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో Settings and Privacy> Settings> Notifications> Notification Settings అనే విభాగంలోకి వెళ్లి అవసరం లేని Notification Dotsని డిజేబుల్ చేసుకోవటానికి ఆప్షన్ ఉందో లేదో పరిశీలించండి. సహజంగా ఫేస్ బుక్ అప్లికేషన్ పైభాగంలో Groups, Marketplace, Profile, Menu అనే విభాగాలకు సంబంధించి ఇక మీదట రెడ్ కలర్లో నోటిఫికేషన్ డాట్స్ చూపించబడకుండా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ ఆప్షన్ మీకు ఇప్పటికీ లభించకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫేస్ బుక్ వినియోగదారులకు ఇది ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. కొంత వరకు ఫేస్ బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి రెడ్ కలర్ అటెన్షన్ గ్రాబర్ మూలంగా ఆందోళన తగ్గించుకోవచ్చు.