Google Maps అనునిత్యం అందరం వాడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు అనేక సరికొత్త సదుపాయాలు ప్రవేశపెడుతున్న గూగుల్ మ్యాప్స్ తాజాగా చాలా అవసరమైన ముఖ్యమైన సదుపాయం తీసుకొస్తోంది.
సహజంగా ఫేస్ బుక్ వాడే చాలా మంది వినియోగదారులకు Facebook Events గురించి తెలిసిందే. పలువురు వ్యక్తులు కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేదా కొన్ని వ్యాపార సంస్థలు ఈవెంట్లు నిర్వహించాలన్నా Facebook Events మీద ఆధారపడుతున్నారు. ఇదే రకమైన సదుపాయం తాజాగా Google Mapsలోకి వస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొద్ది మంది వినియోగదారులకు, ఈ Google Maps Events సదుపాయం ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందించబడింది. గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత, అందులో ఈవెంట్స్ అనే ప్రదేశంలో ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న పలురకాల ఈవెంట్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా ఈవెంట్ నిర్వహించదలుచుకుంటే దాన్ని Google Mapsలో క్రియేట్ చేయొచ్చు. ఆ ఈవెంట్ జరిగే ప్రదేశానికి దగ్గరలో ఉన్న వాళ్లకి అది పబ్లిక్ గా చూపించబడుతుంది.
అలాగే, మీరు క్రియేట్ చేసిన ఈవెంట్ గురించి మీకు కావాల్సిన వ్యక్తులకు షేర్ చేయటం ద్వారా, వారు కూడా దాంట్లో పాల్గొనే విధంగా చేసుకోవచ్చు. ఎవరైతే ఈవెంట్ కి రావటానికి ఇష్టపడతారో వారికి Google Maps నోటిఫికేషన్ల రూపంలో అలర్ట్స్ కూడా పంపిస్తుంది. ఈవెంట్ జరిగే లొకేషన్ కి చేరుకోవటానికి గూగుల్ మ్యాప్ ఎటూ వాడొచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సదుపాయం అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.