Google Pay కేవలం ఒకరికొకరు పేమెంట్స్ పంపించుకోవటానికి మాత్రమే కాకుండా, నేరుగా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దగ్గర్నుండి, కావలసిన కిరాణా వస్తువులు అప్లికేషన్ నుండి కొనుగోలు చేయడం వరకు అన్ని రకాల సేవలు అందించబోతోంది.
తాజాగా Google Pay యాప్‌లో కీలకమైన కొత్త సదుపాయాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ వ్యాపార సంస్థలు తమకంటూ ప్రత్యేకంగా గూగుల్ ప్లే అప్లికేషన్ లో తమ దగ్గర లభించే వస్తువులు, సేవలు పొందుపరచవచ్చు. అంటే ఉదాహరణకి Swiggy, Zomato వంటి అప్లికేషన్స్ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండా, నేరుగా గూగుల్ పే అప్లికేషన్ ద్వారానే కావలసిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొచ్చు.
అలాగే ఈ సినిమా టికెట్స్ కోసం కూడా Book My Show వంటి యాప్స్‌తో మన లేకుండా వాటిని గూగుల్ పే యాప్ లోనే పొందొచ్చు. వీటితోపాటు క్యాబ్ బుకింగ్, ఇతర అన్ని రకాల సేవలు కూడా Google Payలో నేరుగా పొంది, వాటికి సంబంధించిన పేమెంట్స్ చేయటం ద్వారా ఆయా సర్వీసులు అప్పటికప్పుడు మనకు లభించే విధంగా అవకాశం పొందొచ్చు. తమ ఫోన్లో అనేక అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పనిలేకుండా కేవలం Google Pay ఉంటే చాలు, దాదాపు అనేక సర్వీసులు ఒకే చోట పొందే అవకాశం దీని ద్వారా కలుగుతుంది.
అంతేకాదు, మీ ఏరియాలో ఉండే కిరాణా షాపులు, బార్బర్ షాపులు, పానీపూరీ సెంటర్లు ఇలా దాదాపు ప్రతీ షాప్ తనకంటూ ఒక షాప్‌ని Google Payలో క్రియేట్ చేసుకుని, తమ దగ్గర లభించే వస్తువుల వివరాలు అందులో పొందుపరచవచ్చు. మనం వారి వద్ద ఉండే వస్తువులను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకుని నేరుగా వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా వారు మన ఇంటికి డోర్ డెలివరీ చేసే విధంగా ఆప్షన్ కోరవచ్చు. ఈ కొత్తరకం సర్వీస్ ద్వారా గూగుల్ పే మరింత శక్తివంతంగా మారుతుంది.